కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని స్టేజీపైనే కళ్లనీళ్లు పెట్టుకున్న పప్పూయాదవ్
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మద్దతుదారులతో మాట్లాడుతూ పప్పూయాదవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ రాజకీయాల్లో పప్పు యాదవ్‌గా పేరున్న ఆ రాష్ట్ర మాజీ ఎంపీ రాజేష్ రంజన్ కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పూర్నియా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకు పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన పప్పూయాదవ్, తనకు టికెట్ ఇవ్వలేదని స్టేజీ పైనే అందరి ముందు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. పూర్నియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పప్పూయాదవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పూర్నియా నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ కోసం తన పార్టీ జన్ అధికార్‌ను కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఆర్జేడీ పార్టీ అభ్యర్థి భీమా భారతికి పూర్నియా టికెట్ దక్కింది. ఇదే పప్పూయాదవ్‌ను బాధించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు పదేపదే టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారు, తనకేం తక్కువ అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇదే సమయంలో ఆర్జేడీ అగ్రనేతలు లాలు, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేశారు. నామినేషన్ సందర్భంగా భీమా భారతి వెంట తేజవి వచ్చిన నేపథ్యంలో, నామినేషన్ల సమయంలో మీరెన్నడూ అభ్యర్థి వెంట లేరు. కానీ, ఈసారి నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అభ్యర్థి వెంట వచ్చారు. ఏడాది కాలంగా పూర్నియా కోసం పనిచేస్తున్న నాకు దక్కిన గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.