Naveen Patnaik : పాండియన్ మంచివాడు.. సమర్థత కలిగిన నేత
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మొదటిసారిగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మొదటిసారిగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ సమర్థత కలిగిన నేత, కానీ అతను నా రాజకీయ వారసుడు కాదని, ఒడిశా ప్రజలే నా వారసుడు ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు. అయితే పాండియన్‌పై విమర్శలు రావడం దురదృష్టకరం, అతను పార్టీలో చేరినప్పటి నుంచి ఎలాంటి పదవులు అనుభవించలేదు, ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అతను గత 10 ఏళ్లలో అద్బుతంగా పనిచేశాడు. రెండు తుఫానులు, కరోనా సమయంలో సేవ చేశాడు, అతను నీతి, నిజాయితీ గల వ్యక్తి, దాన్ని గుర్తుంచుకోవాలని, పాండియన్ అనుభవజ్ఞుడైన నాయకుడు అని పట్నాయక్ ప్రశంసించారు.
ఇటీవల బీజేడీ నాయకుల్లో ఒక వర్గం పాండియన్‌పై ఆగ్రహంగా ఉండటం, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ సీఎం పట్నాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒడిశాలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పట్నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా, బీజేడీ 51 సీట్లు గెలుచుకుంది.