సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు..దీటుగా బదులిచ్చిన భారత్!

జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తో్ంది. శుక్రవారం అర్ధరాత్రి పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ స్థావరాలపై పాకిస్థాన్ సైనికులు అకారణంగా కాల్పులు జరిపినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Update: 2024-06-29 14:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తో్ంది. శుక్రవారం అర్ధరాత్రి పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ స్థావరాలపై పాకిస్థాన్ సైనికులు అకారణంగా కాల్పులు జరిపినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కవ్వింపు చర్యలకు భారత్ సైతం దీటుగా సమాధానమిచ్చినట్టు వెల్లడించాయి. సరిహద్దు అవతల నుంచి కృష్ణ ఘాటిలోని ఫార్వర్డ్ ఇండియన్ పోస్ట్‌పై కాల్పులకు తెగపడగా..నియంత్రణ రేఖ వద్ద రక్షణగా ఉన్న ఇండియన్ ఆర్మీ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పేర్కొన్నాయి. కొద్ది సేపు జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపాయి. ఈ కాల్పుల ద్వారా భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులకు రక్షణ కల్పించే ప్రయత్నం జరిగి ఉండవచ్చని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించారు.పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసేందుకు భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అమర్ నాథ్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో అమర్‌నాథ్ యాత్రకు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టినట్లు జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌ఆర్ స్వైన్ తెలిపారు. కాగా, కశ్మీర్ లో ఇటీవల అనేక ఉగ్రదాడులు జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఇస్లామాబాద్‌లో కొత్తగా ఆమోదించబడిన ఉగ్రవాద నిరోధక చర్య అయిన ఆపరేషన్ అజ్మ్-ఇ-ఇస్తేకామ్ విజయవంతం కావడానికి తన దేశానికి చిన్న ఆయుధాలు, ఆధునిక పరికరాలను అందించాలని యూఎస్‌లోని పాకిస్తాన్ రాయబారి అమెరికాకు విజ్ఞప్తి చేశారు.

Similar News