పాకిస్తాన్‌లో లీటర్ పాలు ప్యారిస్‌లో కంటే కాస్ట్లీ

కొత్త పన్నులు విధించిన తర్వాత పాల ధరలు ఏకంగా 25 శాతం పెరగడం గమనార్హం.

Update: 2024-07-04 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో పాల ధరలు మరిగిపోతున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన్ దేశాల్లో కంటే పాక్‌లోనే ఖరీదైపోయాయి. ఆ దేశంలో కొత్త పన్నులు విధించిన తర్వాత పాల ధరలు ఏకంగా 25 శాతం పెరగడం గమనార్హం. గురువారం బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, కరాచీలో లీటర్ పాల ధర 370(1.33 డాలర్లు) పాకిస్తాన్ రూపాయలకు చేరాయి. ఇది ప్యారిస్‌లో లీటర్ పాలు 1.23 డాలర్లు, మెల్‌బోర్న్‌లో 1.08 డాలర్లు, ఆమ్‌స్టర్‌డామ్‌లో 1.29 డాలర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ గత నెల వార్షిక బడ్జెట్‌లో పన్నుల మార్పును ప్రకటించారు. అందులో ప్యాక్ చేసిన పాలపై 18 శాతం పన్నును ప్రతిపాదించారు. కొత్త పన్నుల వల్ల పాల రిటైల్ ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ దేశంలో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది. దేశంలో 40 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. ఇప్పటికే పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత కఠిన పరిస్థితి కానుంది. పాక్‌లోని పిల్లల్లో 60 శాతం మంది రక్తహీనతతో, 40 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. 


Similar News