ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి- బీఎస్పీ చీఫ్ మాయావతి

తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.

Update: 2024-07-07 08:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆదివారం చైన్నైకి చేరుకున్న మాయావతి.. అక్కడి నుంచి నేరుగా ఆర్మ్ స్ట్రాంగ్ నివాసానికి చేరుకున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆయన భార్యను, కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆమె వెంట బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ ఉన్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. స్థానిక పోలీసులు అరెస్టు చేసిన వారు అసలు దోషులు కాదని అన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ ని హత్య చేసిన తీరు చూస్తే.. తమిళనాడులో లా అండ్ ఆర్డర్ అంటూ ఏమీ లేదని తెలుస్తోందని మండిపడ్డారు. అతడిని చంపిన అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా తమ పార్టీ నిరసన చేపడుతుందని స్టాలిన్ ప్రభుత్వాన్ని బెదిరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కాగా, శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటి సమీపంలో ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యలో హతమైన గ్యాంగ్ స్టర్ ఆర్కాట్ సురేష్ సహచరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Similar News