పీవోకే ముమ్మాటికీ ఇండియాదే : Rajnath Singh

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ భారత్‌లోనే భాగమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.

Update: 2023-06-26 12:02 GMT

జమ్మూ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ భారత్‌లోనే భాగమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పీవోకే తమదే అని పదే పదే క్లెయిమ్స్ చేసుకోవడం వల్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఏమీ సాధించలేదని స్పష్టం చేశారు. దేశ రక్షణ యంత్రాంగం అంతర్గత, బాహ్య పరిమాణాలపై జమ్మూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన "భద్రతా సమ్మేళనం"లో రక్షణ మంత్రి ప్రసంగించారు. "పీవోకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాం. ఈ ఉద్దేశంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటివరకు మూడు ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించాం" అని రాజ్‌నాథ్ చెప్పారు.

"మొత్తం కాశ్మీర్‌ మాదే.. కాశ్మీర్‌‌లో ఎక్కువ భాగం ఇంకా పాక్ ఆక్రమణలో ఉంది. ఓ వైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ జీవితాలను ప్రశాంతంగా గడుపుతుంటే.. మరోవైపు పీవోకేలో నివసిస్తున్న ప్రజలు చాలా బాధలను అనుభవిస్తున్నారు. వారు కూడా భారతదేశంలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు " అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు.


Similar News