Kargil War :‘కార్గిల్’ పాపాన్ని తొలిసారిగా అంగీకరించిన పాక్ సైన్యం

దిశ, నేషనల్ బ్యూరో : కార్గిల్ యుద్ధం తమ పాపమేనని పాకిస్తాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది.

Update: 2024-09-07 15:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కార్గిల్ యుద్ధం తమ పాపమేనని పాకిస్తాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. పాకిస్తాన్ డిఫెన్స్ డే సందర్భంగా రావల్పిండిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ ప్రసంగిస్తూ కార్గిల్ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘1948 యుద్ధం, 1965 యుద్దం, 1971 యుద్ధం, 1991 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం, ఇస్లాం కోసం వేలాది మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలిచ్చారు’’ అని ఆయన పేర్కొన్నారు.

కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర ఉందని గతంలో ఎన్నడూ పాక్ ఆర్మీ అధికారికంగా పేర్కొనలేదు. ఆ యుద్ధంలో ముజాహిదీన్లు, స్వాతంత్య్ర యోధులు పాల్గొన్నారంటూ పాక్ ఆర్మీ చెప్పుకునేది. కానీ ఆ వార్‌లో పోరాడింది తమ సైనికులేనని పాక్ ఆర్మీ చీఫ్ తొలిసారిగా అంగీకరించారు. కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కార్గిల్ సెక్టార్‌, టైగర్ హిల్ ఏరియాల్లోకి రాత్రికిరాత్రి చొరబడి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న పాక్ దళాలను దాదాపు మూడు నెలల సుదీర్ఘ యుద్ధం తర్వాత భారత సైన్యం విజయవంతంగా తరిమికొట్టింది. కార్గిల్‌లో చనిపోయిన పాక్ సైనికుల డెడ్‌బాడీలను స్వీకరించేందుకు కూడా నాటి పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను భారత్ నిర్వహించుకుంటోంది.


Similar News