CM Biren Singh: మణిపూర్ అల్లర్లలో విదేశీ హస్తం.. సీఎం బిరేన్ సింగ్

మణిపూర్‌ మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ఓ మయన్మార్ పౌరుడిని అస్సాం రైఫిల్స్ అరెస్టు చేసింది.

Update: 2024-09-16 15:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో పనిచేస్తున్న మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ఓ మయన్మార్ పౌరుడిని అస్సాం రైఫిల్స్ ఇటీవల అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. సోమవారం ఆయన ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. ఈ విషయాన్ని మొదట్లో కొందరు నమ్మగా మరికొందరు విశ్వసించలేదన్నారు. మయన్మార్ జాతీయుడిని అస్సాం రైఫిల్స్ అరెస్టు చేయడంతో అల్లర్లలో విదేశీయుల హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.

పక్కా సమాచారంతో విదేశీ పౌరుడిని అరెస్టు చేసిన అస్సాం రైఫిల్స్‌ను అభినందించారు. ప్రస్తుత సంక్షోభానికి విదేశీ అంశాలే ఆజ్యం పోస్తున్నాయని స్పష్టం చేశారు. కాగా, ఈనెల 14న కుకీ నేషనల్ ఆర్మీ బర్మా (కేఎన్ఏ-బీ)కి చెందిన వ్యక్తిని మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ అరెస్ట్ చేసింది. ఆయనను మయన్మార్‌లోని ఖంపట్‌కు చెందిన పౌరుడిగా గుర్తించారు. ఇండో-మయన్మార్ సరిహద్దు పట్టణం మోరే నుంచి కుకీ-ఆధిపత్య జిల్లా చురచంద్‌పూర్ వరకు ఆయుధాలు సరఫరా చేసేందుకు గాను నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.


Similar News