రాష్ట్రపతితో ప్రతిపక్షాల భేటీ..

ప్రతిపక్ష పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానుంది.

Update: 2023-08-01 14:24 GMT

న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానుంది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో సమగ్ర చర్చ, ప్రధాని మోడీ ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మణిపూర్ అంశంపై చర్చించేందుకు విపక్ష నాయకులకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని విపక్షాల బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు ముర్ము సమయమిచ్చారు.

గత నెల 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించిన ‘ఇండియా’ కూటమికి చెందిన 21 మంది ఎంపీలు కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉంటారు. మణిపూర్ హింసాకాండపై రూల్ 267 కింద చర్చ జరగాలని, ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తామని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రమే సమాధానం ఇస్తారని మొండికేసింది. దీంతో రాష్ట్రపతి జోక్యాన్ని విపక్షాలు కోరాయి.


Similar News