అలా అయితేనే రాహుల్ యాత్రకు మద్దతిస్తాం: కాంగ్రెస్‌కు అఖిలేష్ అల్టిమేటం!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్ వాద్ పార్టీ యాత్రలో పాల్గొనడంపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-02-19 07:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్ వాద్ పార్టీ యాత్రలో పాల్గొనడంపై ఉత్కంఠ నెలకొంది. సీట్ల పంపకాల విషయం తేలాకే యాత్రకు మద్దతు తెలుపుతామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని వీటిపై స్పష్టత వచ్చాకే జోడో న్యాయ్ యాత్రలో చేరతామని అఖిలేష్ చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 80లోక్ సభ స్థానాలకు గాను కేవలం 15మాత్రమే కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు హస్తం పార్టీ ఒప్పుకుంటేనే ఎస్పీ రాహుల్ యాత్రకు మద్దతు తెలుపుతుందని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ఎక్కువ సీట్లు అడిగితే కూటమిని వీడే చాన్స్!

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. అనేక పార్టీలు ఇందులో భాగస్వామ్యం అయినప్పటికీ..సీట్ షేరింగ్ విషయంలో పూర్తిగా విఫలమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిహార్‌లో కూటమికి నితీశ్ గుడ్ బై చెప్పడం, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతంగా ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించడంతో కూటమిలో సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సీట్ల పంపకం వ్యవహారంతో అసలు కూటమి చివరి వరకు నిలబడుతుందా అనే అనుమానం కలుగుతోంది. మరి ఎస్పీ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. అయితే కాంగ్రెస్ 15 సీట్ల కంటే ఎక్కువ అడిగితే ఎస్పీ ఇండియా కూటమి నుంచి వైదొలిగే అవకాశం ఉందని ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News