One Nation, One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ అసాధ్యం.. ప్రతిపక్ష నాయకుల స్పందనిదే ?

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Update: 2024-09-18 15:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పలువురు రాజకీయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, సీపీఐ, ఆప్, జేఎంఎం నాయకులు ఈ అంశంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దీనిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని సీపీఐ నేత రాజా తెలిపారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు జరగడం అసాధ్యం. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దీనిని ముందుకు తీసుకెళ్లలేరు. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. దాని పరిణామాలను అధ్యయనం చేయాలి’ అని పేర్కొన్నారు.

కేబినెట్ నిర్ణయం ఓ జిమ్మిక్: మాజీ సీఎం హరీశ్ రావత్

ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని జిమ్మిక్‌గా అభివర్ణించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు పలు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు. ఈ విధానం దేశ సమాఖ్య వ్యవస్థకు అనుకూలంగా లేనందున ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నా యకుడు టీఎస్ సింగ్ డియో మాట్లాడుతూ భారత్ రాజ్యాంగం ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. దేశంలోని లోక్ సభ, రాష్ట్రంలోని శాసన సభలు ఒకే సారి ఎన్నికవుతాయని, అనంతరం ఒక రాష్ట్రంలో లేదా కేంద్రంలో ప్రభుత్వం రెండేళ్ల తర్వాత పడిపోతే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు.

కాలపరిమితి పూర్తి కాకుండానే ప్రభుత్వం పడిపోతే?: ఆప్ ఎంపీ సందీప్ పాఠక్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సందీప్ పాఠక్ స్పందించారు. ఇది రాష్ట్రాలను అస్థిరపరిచే కుట్ర అని ఆరోపించారు. ‘ప్రస్తుత సమయంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ప్రకటించాల్సి ఉంది. కానీ హర్యానా, జమ్మూ కశ్మీర్‌లకు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేశారు. నాలుగు రాష్ట్రాలకే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేకపోతే, దేశం మొత్తం మీద ఏకకాలంలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు. అంతేగాక ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కాలం పూర్తి కాకుండానే పతనమైతే పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయాలు సామ్రాజ్యవాదాన్ని తలపిస్తున్నాయి: జేఎంఎం

జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని సామ్రాజ్యవాదం వైపు తీసుకెళ్తున్నాయని ఆరోపించారు. ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదన రాజ్యాంగంపై దాడేనని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదని దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలు చేయాలనుకుంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రవిదాస్ మల్హోత్రా సూచించారు.


Similar News

టమాటా @ 100