రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాల తొలగింపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలంటూ రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణు శంకర్ జైన్‌ దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

Update: 2024-02-09 14:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలంటూ రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణు శంకర్ జైన్‌ దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ‘‘రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించిన 1949 నవంబర్ 26వ తేదీని కంటిన్యూ చేస్తూనే.. దానిలో మార్పులు, చేర్పులు చేయొచ్చా ?’’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ‘‘అకడమిక్ అవసరాల కోసం 1949 నవంబర్ 26వ తేదీని కంటిన్యూ చేస్తూనే.. ప్రవేశిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించుకోవచ్చు. దానివల్ల సమస్యేం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ప్రవేశికలో ఆ రెండు పదాలు లేవు’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగ ప్రవేశిక నిర్దిష్ట తేదీతో వస్తుంది. కాబట్టి దానిలో ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేయకూడదు’’ అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్‌ వాదన వినిపించారు. ఈక్రమంలో మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి జోక్యం చేసుకుని.. ఎమర్జెన్సీ (1975-77) టైంలో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను చేర్చారని గుర్తుచేశారు. ఈ పిటిషన్ల ఫైళ్లను ఉదయాన్నే స్వీకరించామని.. వాటి సమగ్ర అధ్యయనానికి మరింత సమయం అవసరమని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు పిటిషన్లను గతంలో ఇదే అంశంపై బలరామ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌తో ట్యాగ్ చేశామని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

Tags:    

Similar News