'భార్యను కొట్టే.. హింసించే హక్కు ఏ చట్టమూ ఇవ్వలేదు'

తన భార్యను కొట్టే, చిత్రహింసలకు గురి చేసే హక్కు భర్తకు ఏ చట్టమూ ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-08-28 17:00 GMT

న్యూఢిల్లీ: తన భార్యను కొట్టే, చిత్రహింసలకు గురి చేసే హక్కు భర్తకు ఏ చట్టమూ ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. క్రూరంగా ప్రవర్తించడం, వదిలి పెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్యతో సంసార జీవితాన్ని గడపడంలో భర్త విఫలమయ్యాడని, భౌతికంగా విడిపోవడమే కాదు.. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లలేదనే విషయం స్పష్టమైనందున అతడితో వైవాహిక బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహిళకు సంబంధించిన వైద్య పత్రాలను పరిగణనలోకి తీసుకున్నా, శారీరక దాడికి గురైన మహిళ వాంగ్మూలాన్ని పరిశీలించినా, ఆ విషయాలను ఆమె భర్త ఖండించని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. విడాకులు మంజూరు చేయడం సరైనదేనని హైకోర్టు వివరించింది. ‘వివాహం చేసుకున్న మాత్రాన భర్త అనే హక్కుతో భార్యను కొట్టే, హింసించే హక్కును ఏ చట్టమూ ఇవ్వలేదు.

అలా చేస్తే శారీరక క్రూరత్వంగా భావించాల్సి ఉంటుంది. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13(1) (ఐఏ) కింద విడాకులు మంజూరు చేసే అధికారం మాకు ఉంది’ అని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేసేందుకు ప్రతివాది కూడా అభ్యంతరం చెప్పలేదని, దీన్ని బట్టే వివాహ బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యం అతడికి లేదని స్పష్టమవుతోందని గుర్తు చేసింది. ఓ మహిళను 2013 ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్న ప్రతివాది భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి అదే ఏడాది మే 11వ తేదీన ఆమె తల్లిగారింటి వద్ద వదిలేశాడు. తర్వాత ధనవంతుల కుటుంబానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేయగా ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేసింది.


Similar News