'భద్రతను కట్టుదిట్టం చేయండి'.. ఢిల్లీ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-08-02 10:33 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఘర్షణలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ మద్దతుదారులు దేశ రాజధానిలో ర్యాలీలు చేపడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ ర్యాలీలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి, సీసీటీవీలతో గట్టి నిఘా ఉంచాలని ఢిల్లీ అధికార యంత్రాంగాన్ని నిర్దేశించింది. ఈ నిరసనల్లో ఎలాంటి హింస గానీ, విద్వేష ప్రసంగాలు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు నూహ్ జిల్లా ఘటనను నిరసిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ శ్రేణులు ఢిల్లీలో దాదాపు 30 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.


Similar News