J&K: రియాసి ఉగ్రదాడి కేసులో ఏడు చోట్ల NIA సోదాలు

జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో బస్సుపై ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం రాజౌరీ, రియాసి జిల్లాల్లో ఏడు చోట్ల సోదాలు నిర్వహించింది

Update: 2024-09-27 05:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో బస్సుపై ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం రాజౌరీ, రియాసి జిల్లాల్లో ఏడు చోట్ల సోదాలు నిర్వహించింది. ఉదయమే ఆయా ప్రాంతాలకు చేరుకున్న బృందాలు పలు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు, రాజౌరికి చెందిన హకమ్ ఖాన్ అనే వ్యక్తి ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, ప్రయాణానికి సహాయం అందించినందుకు, అలాగే దాడికి ముందు ఆ ప్రాంతాన్ని పరిశీలించడంలో వారికి సహాయం చేసినందుకు అరెస్టు చేయబడ్డాడు. సోదాల్లో భాగంగా అధికారులు దాడులకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ కేసు విషయానికి వస్తే, జూన్ 9న జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో శివ్ ఖోరీ దేవాలయం నుండి మాతా వైష్ణో దేవి ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. బస్సు డ్రైవర్ కాల్పులకు గురికావడంతో నియంత్రణ కోల్పోగా అది లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. బస్సు దాడిలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జూన్ 17న NIA ఈ కేసు విచారణ చేపట్టింది. ఉగ్రవాదులకు సహాయం చేసిన హకమ్ ఖాన్ ప్రస్తుతం అధికారులు అదుపులో ఉండగా, అతని నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. అందులో భాగంగానే ఈ సోదాలు చేపట్టారు.


Similar News