కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్
విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించడమే కాకుండా వారికి సరైన సౌకర్యాలు, బోధనా పద్దతుల మెరుగుదల, అధిక ఫీజుల నుంచి రక్షణకు
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు కేంద్ర విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా దేశంలో జరుగుతున్న కోచింగ్ పేరుతో జరుగుతున్న అరాచకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించడమే కాకుండా వారికి సరైన సౌకర్యాలు, బోధనా పద్దతుల మెరుగుదల, అధిక ఫీజుల నుంచి రక్షణ నిమిత్తం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కోచింగ్ సెంటర్లకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్‌ల నమోదు, సరైన ఫ్రేమ్‌వర్క్, వాటి నిర్వహణకు కనీస ప్రమాణాలను సిఫార్సు చేయడం, నమోదు చేసుకున్న విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం, సమగ్ర అభివృద్ధికి కరిక్యులర్ యాక్టివిటీస్‌ని ప్రోత్సహించడం, కెరీర్ గైడెన్స్, సైకలాజికల్ కౌన్సిలింగ్ అందించే ప్రాథమిక లక్ష్యాలు వీటిని రూపొందించారు.
కోచింగ్ సెంటర్ల కొత్త మార్గదర్శకాలు..
* సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు అనుమతి. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని చేర్చుకోకూడదు.
* కోచింగ్ సెంటర్లలో అర్హత ఉన్న సిబ్బందిని మాత్రమే నియమించాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* విద్యార్థుల తల్లిదండ్రులను ర్యాంకులు, మార్కుల పేరుతో తప్పుదారి పట్టించే హామీలు ఇవ్వకూడదు.
* సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, ట్రైనింగ్ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రీఫండ్ వంటి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచాలి.
* కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల ఫలితాల గురించి మోసపూరితంగా యాడ్స్ ఇవ్వకూడదు.
* కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు తగిన స్థలం కేటాయించి, సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాద సమయంలో ప్రాణ నష్టాన్ని నిలువరించే భద్రతా ప్రమాణాలను పాటించాలి.
* ట్రైనింగ్ ఇచే సంస్థ లేదా వ్యక్తి కోచింగ్ మొదలుపెట్టిన మూడు నెలల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో సెంటర్లు నిర్వహించేవారు తప్పనిసరిగా బ్రాంచులను రిజిస్ట్రేషన్ చేయాలి.
* విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మానసిక ఒత్తిడిని అధిగమించే కౌన్సిలింగ్ ఇవ్వాలి.