కొత్త పార్లమెంట్‌లో మంత్రులకు గదుల కేటాయింపు..

వినాయక చవితి వేళ ఈనెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ జరగనున్నాయి.

Update: 2023-09-15 16:18 GMT

న్యూఢిల్లీ : వినాయక చవితి వేళ ఈనెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పూర్తి ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ ఏర్పాట్లతో ముడిపడిన పలు కీలక అప్ డేట్స్ వచ్చాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో కేంద్ర మంత్రులకు గదులను కేటాయించిన లిస్టును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు రూమ్ నంబర్ 34, హోంమంత్రి అమిత్ షాకు రూమ్ నంబర్ 33, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రూమ్ నంబర్ 8, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు 30వ నంబర్ గది, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి 31వ నంబర్ గది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు 12వ నంబర్ గది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి 17వ నంబర్ గదిని కేటాయించారు.

కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశిస్తున్న వేళ.. పార్లమెంటు సభ్యులందరికీ స్మార్ట్ ఐడీ కార్డులను జారీ చేస్తున్నట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈనెల 18న ఉదయం 10.30 గంటల నుంచి పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసే కౌంటర్లలో పాత ఐడీ కార్డులను ఇచ్చేసి, కొత్త స్మార్ట్ ఐడీ కార్డులను తీసుకోవాలని ఉభయ సభల ఎంపీలను కోరారు. స్మార్ట్ ఐడీ కార్డుల కోసం ఇంకా బయో మెట్రిక్, పర్సనల్ సమాచారం ఇవ్వని ఎంపీల కోసం ప్రత్యేక కౌంటర్ సోమవారం రోజున తెరిచి ఉంటుందని, అక్కడికి వెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఈనెల 17న (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు కొత్త పార్లమెంటు భవనంలోని గజద్వారం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని ఎంపీలను కోరింది.


Similar News