Nepal pm kp Oli: భారత్‌తో కనెక్టివిటీని పెంచండి.. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఆదేశాలు

భారత్‌తో కనెక్టివీటిని పెంచాలని నేపాల్ ప్రధాన మంత్రి కేపీ ఓలీ తమ అధికారులకు పిలుపునిచ్చారు. జలమార్గాలు, రైల్వేలను విస్తరించాలని తెలిపారు.

Update: 2024-08-05 10:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో కనెక్టివీటిని పెంచాలని నేపాల్ ప్రధాన మంత్రి కేపీ ఓలీ తమ అధికారులకు పిలుపునిచ్చారు. జలమార్గాలు, రైల్వేలను విస్తరించాలని తెలిపారు. ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో ఓలి ప్రసంగించారు. భారత్ సరిహద్దు సమీపంలోని హనుమాన్‌నగర్ నుంచి త్రివేణి, దేవఘాట్ వరకు స్టీమర్ సర్వీసులను నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. 1970 నుంచి నేపాల్‌లో స్టీమర్ సేవలను అనుమతించే చట్టం ఉన్నప్పటికీ, అటువంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకోలేదని, ఇది దురదృష్టకరమని చెప్పారు.

వస్తువులు, ప్రజలను తరలించడానికి జలమార్గ రవాణా అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి అని నొక్కిచెప్పారు. దేశంలో స్టీమర్లను అతి త్వరలో నడపడానికి ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. జలమార్గాలతో పాటు, నేపాల్ రైల్వే సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతమున్న జనక్‌పూర్-కుర్తా రైలు మార్గానికి రెండు రైల్వే లైన్‌లను పెంచాలని పిలుపునిచ్చారు. నేపాల్‌లో తూర్పు-పశ్చిమ రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాలని దీని ద్వారా అసోంలోని గువహటి నుంచి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని సిల్‌గురి నుంచి నేపాల్ మీదుగా హరిద్వార్ వరకు ప్రయాణించే భారతీయ పౌరులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News