Supreme Court :15 గంటల పాటు విచారించడం అమానుషం.. ఈడీపై సుప్రీంకోర్టు ఫైర్
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేందర్ పన్వార్‌ను ఈడీ 15 గంటల పాటు విచారించడం అమానుషమని సుప్రీంకోర్టు తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)పై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న హర్యానా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ (Surender panvar) ను ఈడీ 15 గంటల పాటు విచారించడం అమానుషమని తెలిపింది. దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయింది. అంతేగాక సురేందర్ అరెస్ట్ చట్టవిరుద్దమని ప్రకటించింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన సురేంద్ర పన్వార్‌ను హైకోర్టు రిలీజ్ చేయడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
కాంగ్రెస్ నేతను 15 గంటల పాటు విచారించడం పూర్తిగా అమానుషమని పేర్కొంది. ఎందుకంటే ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసు కాదని, ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించినదని గుర్తు చేసింది. అలాంటప్పుడు వ్యక్తులతో వ్యవహరించే పద్దతి ఇదేనా అని ఈడీని ప్రశ్నించింది. వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేవమని స్పష్టం చేసింది. అయితే పన్వార్‌ను 14.40 గంటలపాటు నిరంతరం ప్రశ్నించారని, విచారణ సమయంలో విందు విరామాన్ని సూచించడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ తెలిపారు.
కాగా, అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ హర్యానా రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురేంద్ర పన్వార్‌ను గతేడాది జూలై 20న ఈడీ అరెస్టు చేసింది. కోట్లాది రూపాయల మనీలాండరింగ్, అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చింది. అయితే ఆ తర్వాత ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.