నీట్-యూజీ కౌన్సిలింగ్‌పై స్టేకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

ఇదే సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం ఇస్తూ, జూలై 5కి కేసును వాయిదా వేసింది.

Update: 2024-06-12 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష(2024) పేపర్ లీక్, ఇతరత్రా అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్‌ల కౌన్సిలింగ్‌పై స్టే విధించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఇదే సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం ఇస్తూ, జూలై 5కి విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వివిధ హైకోర్టుల నుంచి ఈ వ్యవహారంలోని అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేస్తామన్నారు. విద్యార్థుల్లో ఉన్న ఆందోళనలకు పరిష్కారంగా ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేసుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఎన్‌టీఏ బదిలీ పిటిషన్‌ను చేయనున్న కారణంగా విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. అంతకుముందు రోజు సుప్రీంకోర్టు కూడా కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్టే చేసేందుకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం నిరాకరించింది. అలాగే, ప్రశ్నాపత్రం లీక్, ఇతర అవకతవకలకు సంబంధించి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్‌టీఏకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 


Similar News