ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్షాలను అవమానిస్తోంది: కాంగ్రెస్ ఎంపీ సురేశ్

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను నియమించడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్షాలను అవమానిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ అన్నారు.

Update: 2024-06-24 04:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను నియమించడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్షాలను అవమానిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ అన్నారు. లోక్‌సభ సాధారణ స్పీకర్‌ను ఎన్నుకునే వరకు సభను నడపడంలో మహతాబ్‌కు సహకరించాల్సిన చైర్‌పర్సన్‌ల ప్యానెల్ నుంచి తమ సభ్యులు వైదొలగాలని ఇండియా కూటమి నేతృత్వంలోని ప్రతిపక్షం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక స్పీకర్‌గా మహతాబ్‌ని నియమించడం సభ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని ఫైర్ అయ్యారు. తాను ఎనిమిది సార్లు ఎంపీ అయ్యానని, మెహతాబ్ 7 సార్లు మాత్రమే ఎన్నికయ్యారని గుర్తు చేశారు.

‘ఎన్డీఏ ప్రభుత్వం లోక్‌సభ రూల్స్ ఉల్లంఘించింది. ఇప్పటివరకు అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీనే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అత్యధికంగా 8సార్లు ఎంపీగా గెలిచిన నన్ను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోకుండా అవమానించారు. అందుకే ప్యానెల్‌ను బహిష్కరించాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని తెలిపారు. కాగా, కటక్ నుంచి ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ప్యానెల్ సభ్యులుగా కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే (ఇద్దరూ బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. అయితే ప్యానెల్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. 


Similar News