మెజార్టీ ఎమ్మెల్యేలు మాతోనే.. పార్టీ ఫిరాయింపు నోటీసులు చెల్లవు : Ajit Pawar

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో వర్గ పోరు తీవ్ర రూపు దాల్చింది.

Update: 2023-07-03 14:09 GMT

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో వర్గ పోరు తీవ్ర రూపు దాల్చింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తిరుగుబాటు చేసిన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది. ఎన్‌సీపీ నీదా..? నాదా..? అనేది తేల్చుకునేందుకు పోటాపోటీగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టిన ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత అజిత్ పవార్ సంచలన ప్రకటనలు చేశారు. ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జయంత్ పాటిల్‌ను తొలగించి ఆ స్థానంలో ఎంపీ సునీల్ తట్కరేను నియమిస్తున్నట్లు వెల్లడించారు. జయంత్ పాటిల్, ఎన్సీపీ చీఫ్ విప్ జితేంద్ర అవద్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చామన్నారు. శరద్ పవార్ ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడని అజిత్ పవార్ ఈ సందర్భంగా సెటైర్ వేశారు. "నాతో పాటు 9 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ ఇచ్చిన పార్టీ ఫిరాయింపు నోటీసులకు విలువ లేదు.

ఎందుకంటే పార్టీ మాతోనే ఉంది" అని స్పష్టం చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారు కాబట్టి.. తాము చెప్పిన వ్యక్తినే ఎన్సీపీ చీఫ్ విప్ గా స్పీకర్ నియమిస్తారని ఆయన తెలిపారు. కాగా, ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే కొనసాగుతారని మరో తిరుగుబాటు ఎమ్మెల్యే చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. "జూలై 5న ఎన్సీపీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రూపాలి చకంకర్‌ను నియమిస్తున్నాను. యూత్ వింగ్ అధ్యక్షులుగా సూరజ్ చవాన్ నియమితులయ్యారు. అమోల్ మిత్కారీ, ఆనంద్ పరంజ్పే, తదితరులను అధికార ప్రతినిధులుగా నియమించాం" అని అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే ప్రకటించారు.

మాకు శరద్ పవార్ ఆశీస్సులు కావాలి: ప్రఫుల్ పటేల్

తిరుగుబాటు నేతలపై ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ తీసుకున్న నిర్ణయం చెల్లదని ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌ అన్నారు. "మెజారిటీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాముఖ్యత ఉంది. ఇంకా సమస్య ఉంటే ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యేల బలం లేకుంటే మేం గవర్నర్‌ దగ్గరకు వెళ్లే వాళ్ళమే కాదు.. అజిత్ పవార్ ఇప్పుడు ఎన్సీపీ నాయకుడు. పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించి ఆశీర్వదించాలని శరద్‌పవార్‌ ను కోరుతున్నాం’’ అని ఆయన తెలిపారు.


Similar News