రెండు రాష్ట్రాలను కలిపే రైల్వేస్టేషన్ బెంచ్..! అక్కడ సెల్ఫీలకు ప్రత్యేక అనుమతి..
ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేసేటప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దులు చెక్ పోస్టులు తరచూ చూస్తూనే ఉంటాం.
దిశ, వెబ్‌డెస్క్ : ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేసేటప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దులు చెక్ పోస్టులు తరచూ చూస్తూనే ఉంటాం. అంతే కాదు.. నదులు రెండు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ప్రవహించడాన్ని చూడా చూశాం.. కానీ ఒకే రైల్వేస్టేషన్ రెండు రాష్ట్రాల్లో ఉందన్న విషయం మీకు తెలుసా..? ఒక రైలు ఆ స్టేషన్‌లో ఆగాలంటే ముందు భాగం ఒక రాష్ట్రంలో ఆగితే వెనక భాగం మరో రాష్ట్రంలో ఆగుతుంది. వింటుంటేనే భలే గమ్మత్తుగా ఉంది కదా. ఇంతకీ ఆ రైల్వేష్టేషన్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..!
రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్న రైల్వే స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లో కనబడుతుంది. ఈ రైల్వేస్టేషన్ పేరే నవాపూర్ రైల్వే స్టేషన్. దీన్ని గుజరాత్, మహారాష్ట్రలు చెరోసగం పంచుకుంటున్నాయి. ఈ స్టేషన్ ఒక పక్క మహారాష్ట్ర సరిహద్దుల్లోని నందూర్బార్ జిల్లాలో ఉంది. మరో పక్క గుజరాత్ రాష్ట్రంలోని తాపీ జిల్లాలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులను తెలుపుతూ రైల్వేస్టేషన్‌లో ఓ సరిహద్దు గీత కూడా ఉంది. ఈ స్టేషన్‌లో ఓ బెంచ్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ బెంచ్‌లో సగభాగం మహారాష్ట్రలో ఉంటే మిగతా సగభాగం గుజరాత్‌లో ఉంటుంది.
ఈ రైల్వేస్టేషన్‌ను గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల విభజన జరగక ముందు నిర్మించారు. మే 1, 1961లో ముంబై ప్రావిన్స్ విభజించినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కూడా విభజించారు. అప్పుడు ఈ రైల్వేస్టేషన్ రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉండి ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఈ రైల్వేస్టేషన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే రైల్వేఅధికారులు ఇక్కడ ఓ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణిలు తెగ సెల్ఫీలు దిగుతారు. ఇలాంటిదే మరో రైల్వేస్టేషన్ కూడా భారత దేశంలో ఉంది. అదే ‘భవానీ మండి’ ఈ స్టేషన్ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు మధ్య ఉంది.