మరోసారి కాంగ్రెస్ టార్గెట్‌గా నరేంద్ర మోడీ విమర్శలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

Update: 2023-08-09 13:44 GMT

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్‌ పవార్‌ గతంలో ప్రధాని అయ్యే ఛాన్స్ ను కోల్పోవడానికి కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలే కారణమని ఆయన ఆరోపించారు. బుధవారం మహారాష్ట్ర, రాజస్థాన్‌‌కు చెందిన ఎన్డీఏ కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. "కాంగ్రెస్‌ పార్టీ అనేది ఒక కుటుంబం స్వార్థ ప్రయోజనాల కోసమే నడుస్తోంది. ఆ పార్టీలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా.. వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించదు. ఈ కారణం వల్లే శరద్‌ పవార్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అత్యంత సమర్థులకూ ప్రధాని అయ్యే ఛాన్స్ దక్కలేదు" అని వ్యాఖ్యానించారు.

ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాలే తమకు ముఖ్యమని.. సమష్టిగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్‌లాగా బీజేపీకి అహంకారం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో తాను ఎప్పుడూ భయపడలేదన్నారు. కాగా, ఇదే సమయంలో ఎంపీలకు మోడీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు పనులు చేసిన వాళ్లకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారని సమాచారం. తప్పులు చేసిన ఎంపీలు కొందరు తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరారని ఈ భేటీలో మోడీ చెప్పారని అంటున్నారు.


Similar News