Nadda: ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు సరికావు.. కేంద్ర మంత్రి నడ్డా ఫైర్
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(Jagadheep dhankad) పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా (Jp nadda) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) సీనియర్ నాయకుడని, చైర్మన్ తీర్పు అంతిమమైందనే విషయం తెలుసుకోవాలన్నారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నడ్డా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత ఖర్గే సభ నిర్వహణకు సహకరించడం లేదన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను నడ్డా తోసిపుచ్చారు. ‘ఖర్గేకు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు పుష్కలంగా అవకాశాలు ఇచ్చారు. అయితే తాను మాట్లాడబోనని పలు మార్లు రికార్డుల్లోనే చెప్పారు. చాంబర్‌కు పిలిచినా రావడానికి నిరాకరించారు. సభలో సహకరించడం కాంగ్రెస్ లక్ష్యం కాదు. పనితీరుకు ఆటంకం కలిగించడమే వారి ఉద్దేశం’ అని వ్యాఖ్యానించారు.
పార్లమెంటరీ ప్రక్రియపై ఖర్గే గౌరవం చూపడం లేదని, ఆయన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశాలకు హాజరుకాలేదని మండిపడ్డారు. పార్లమెంటరీ ప్రక్రియల గురించి ఖర్గే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంటు ఆవరణలో చైర్మన్‌ను అనుకరిస్తూ ఒక శాసనసభ్యుడిని చిత్రీకరించారని, ఆ టైంలో కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఏం చేస్తారో గుర్తొచ్చిందని తెలిపారు. దీనిపై సోనియా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కోరుకునే జార్జ్ సోరోస్ స్థాపించిన ఫౌండేషన్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధాలపై అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారని తెలిపారు.