Myanmar: మయన్మార్‌‌లో సైనిక ప్రభుత్వం కీలక నిర్ణయం..

మయన్మార్‌‌లోని సైనిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-01 11:23 GMT

బ్యాంకాక్‌ : మయన్మార్‌‌లోని సైనిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్‌ సూకీకి క్షమాభిక్షను ప్రసాదించింది. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. ఆంగ్‌ సాన్‌ సూకీని 19కిపైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ.. మయన్మార్‌ కోర్టు గతంలో 33ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వీటిలో నాలుగు కేసుల్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే గతవారం సూకీని జైలు నుంచి గృహనిర్భందానికి తరలించారు. బౌద్ధ పండుగ వేడుక సందర్భంగా సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌ సహా 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదిస్తున్నట్టు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది.

ఇక మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌‌కు నాలుగేళ్ల జైలు శిక్ష తగ్గనుంది. తొలిసారిగా 1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆంగ్‌ సాన్‌ సూకీని గృహనిర్భందంలో ఉంచారు. 2010లో ఆమెకు గృహనిర్భందం నుంచి విముక్తి లభించింది. 2015లో మయన్మార్‌లో జరిగిన పోల్స్‌లో ఆమె పార్టీ విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌ సాన్‌ సూకీ పార్టీ మరోసారి విజయం సాధించింది. 2021లో సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేపట్టింది.


Similar News