నూడుల్స్‌లో రూ.6 కోట్ల వజ్రాలు, బంగారం
అక్రమంగా వజ్రాలు, బంగారాన్ని అధికారుల కంట పడకుండా ఇతర దేశాలకు తరలించడానికి ఇటీవల కొంతమంది కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: అక్రమంగా వజ్రాలు, బంగారాన్ని అధికారుల కంట పడకుండా ఇతర దేశాలకు తరలించడానికి ఇటీవల కొంతమంది కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలను, శరీర భాగాల్లో, సామాన్లలో దాచిన బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ రూ.6.46 కోట్లగా ఉంటుందని అధికారులు తెలిపారు. ముంబై నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతను తన ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.2.02 కోట్ల వరకు ఉంటుంది. అనంతరం ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
అలాగే, కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలిని తనిఖీ, ఆమె లోదుస్తుల లోపల 321 గ్రాముల బంగారు కడ్డీలు, కత్తిరించిన ముక్కను దాచిపెట్టి అక్రమంగా తీసుకువెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, దుబాయ్, అబుదాబి నుండి ఒక్కొక్కరు, బహ్రెయిన్, దోహా, రియాద్, మస్కట్, బ్యాంకాక్, సింగపూర్ నుండి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది భారతీయల నుంచి రూ.4.44 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.