గాంధీ, శివాజీ, అంబేద్కర్ విగ్రహాలు తరలించడం దారుణం: కాంగ్రెస్

మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి ప్రముఖుల విగ్రహాలను పార్లమెంట్ ఆవరణ నుంచి తరలించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్ర విమర్శలు చేసింది.

Update: 2024-06-06 12:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి ప్రముఖుల విగ్రహాలను పార్లమెంట్ ఆవరణ నుంచి తరలించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, పార్లమెంట్ హౌస్ ముందు ఉన్న ప్రముఖుల విగ్రహాలను వారి ప్రాధాన్యత స్థలాల నుంచి తరలించారు. ఇదో విద్రోహ చర్య అని అభివర్ణించారు. అలాగే, పార్టీ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ, మహారాష్ట్ర ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపకపోవడంతో, శివాజీ , అంబేద్కర్ విగ్రహాలను నుంచి తొలగించారు. గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ సాధించకపోవడంతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా తరలించారు, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి బీజేపీకి 400 సీట్లు ఇస్తే, వారు రాజ్యాంగాన్ని కూడా విడిచిపెట్టేవారా..? అని ఖేరా ఒక పోస్ట్‌లో తెలిపారు.

పార్లమెంట్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గాంధీ, శివాజీ, అంబేద్కర్‌లతో పాటు, గిరిజన నాయకుడు బిర్సా ముండా, మహారాణా ప్రతాప్‌ వంటి తదితరుల విగ్రహాలను పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న లాన్‌లోకి మార్చారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల తొలి సెషన్ కోసం ప్రాంగణాన్ని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. జూన్‌లో పార్లమెంటు కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. బయట ప్రాంతాల పునరాభివృద్ధిలో భాగంగా, గాంధీ, శివాజీ, మహాత్మా జ్యోతిబా ఫూలేతో సహా జాతీయ చిహ్నాల విగ్రహాలను పాత పార్లమెంట్ భవనంలోని గేట్ నంబర్ 5 సమీపంలోని లాన్‌కు తరలించాలని నిర్ణయించారు, దీనికి సంవిధాన్ సదన్ అని పేరు పెట్టారు.


Similar News