అసోంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజా ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అసోంలోనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం నాగాలాండ్ నుంచి అసోంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజా ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు పనిచేస్తున్నాయని విమర్శించారు. ‘దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అసోంలో ఉంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో అసోం సమస్యలను లేవనెత్తుతాం’ అని చెప్పారు. గతేడాది మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నా.. ప్రధాని అక్కడ పర్యటించలేదన్నారు. నాగా రాజకీయ సమస్య పరిష్కారానికి తొమ్మిదేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ఏమైందని ప్రశ్నించారు. దేశాన్ని దోపిడీ చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. ఈ నెల 25వరకు అసోంలో యాత్ర కొనసాగనుంది. అంతకుముందు నాగాలాండ్ నుంచి శివసాగర్ జిల్లాలోని హలువాటింగ్ మీదుగా భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోంలోకి ప్రవేశించగా..వందలాది మంది కార్యకర్తలు రాహుల్‌కు స్వాగతం పలికారు.