మోహన్ చరణ్ మాఝి అనే నేను..

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా మోహన్ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు.

Update: 2024-06-12 16:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా మోహన్ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవితి పరీదా ప్రమాణస్వీకారం చేశారు. మరో 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మాజీ సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ, బీజేడీ మధ్య విబేధాలు తలెత్తిన తర్వాత నవీన్ పట్నాయక్, మోడీ ఒకే వేదికను పంచుకోవడం మళ్లీ ఇదే తొలిసారి. ఈసందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

సీఎం సతీమణి, తల్లి ఏమన్నారంటే..

‘‘గతంలో సర్పంచ్‌, ఎమ్మెల్యేగా పనిచేసిన నా కుమారుడు ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగాడు’’ అని మోహన్ చరణ్ మాఝి తల్లి బాలే మాఝి సంతోషం వ్యక్తం చేశారు. మోహన్‌ సతీమణి ప్రియాంక మాట్లాడుతూ.. భర్త సీఎం అవుతారని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని భావించామని.. సీఎం అవడం చాలా గొప్పవిషయమని పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరొస్తారా..? అని టీవీ చూస్తున్న తమకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయామని ప్రియాంక చెప్పారు. కాగా, ఒడిశా మూడో గిరిజన సీఎంగా చరణ్ నిలిచారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ గిరిజన వర్గం నుంచి సీఎంలుగా అవకాశాన్ని పొందారు.

నేడు అరుణాచల్ సీఎంగా ఖండూ ప్రమాణం

అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం పెమా ఖండూ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.


Similar News