హింసను వ్యాప్తి చేసే వారికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది: Narendra Modi
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ స్పీడ్‌ను పెంచారు. విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ స్పీడ్‌ను పెంచారు. విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సర్‌గుజాలో విజయ్ సంకల్ప్ శంఖనాద్ మహార్యాలీలో ప్రసంగించిన ప్రధాని, “హింస వ్యాప్తి చేసే వారికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది” అని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అవినీతిపరులపై తీసుకుంటున్న చర్యలకు దేశం మొత్తం సాక్ష్యంగా ఉంది. విక్షిత్ భారత్, విక్షిత్ ఛత్తీస్‌గఢ్ కోసం మీ ఆశీర్వాదం కావాలని ఇక్కడికి వచ్చాను. భారత్ శక్తివంతమైన దేశం అయితే కొన్ని శక్తుల ఆటలు సాగవు, అందుకే కాంగ్రెస్, కొన్ని శక్తులు కోపంతో ఉన్నాయి. భారత్ స్వావలంబనగా మారితే, కొన్ని శక్తులు దుకాణాన్ని మూసేయాల్సి వస్తుంది. అందుకే వారు కాంగ్రెస్, ఇండియా కూటమి బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మోడీ అన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని నేను ముందే చెప్పాను. రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు, భారతదేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని బాబా సాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో నిర్ణయించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మహనీయుల మాటలను, రాజ్యాంగం పవిత్రతను పట్టించుకోలేదు. ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ కోటాలో కొంత భాగాన్ని తీసుకుని మతం ఆధారంగా కొంతమందికి రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ చెప్పింది. వారసత్వపు పన్ను విధిస్తామని కూడా పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ దుష్పరిపాలన, నిర్లక్ష్యమే దేశం నాశనానికి కారణం. బీజేపీ ప్రభుత్వం నేడు తీవ్రవాదం, నక్సలిజంపై కఠిన చర్యలు తీసుకుంటోందని మోడీ అన్నారు.