కాంగ్రెస్ నేతలను మోడీ బెదిరిస్తున్నారు.. రాహుల్ సంచలన ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

Update: 2024-03-17 18:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఐటీ’ల సాయం లేకుండా మోడీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేరని ఆరోపించారు. అవినీతిపై ప్రధాని మోడీకే గుత్తాధిపత్యం ఉందని కామెంట్ చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ముగింపు సభలో ‘ఇండియా కూటమి’ కీలక నేతల సమక్షంలో రాహుల్ ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే అని ఆయన చెప్పారు. ‘‘ఈడీ, సీబీఐలను చూపించి కాంగ్రెస్ నేతలను ప్రధాని మోడీ బెదిరిస్తున్నారు. బీజేపీలో చేరకపోతే జైలులో వేస్తామంటున్నారు’’ అని తెలిపారు. కాంగ్రెస్ నేతలు పార్టీని వీడే ముందు మా అమ్మ సోనియా గాంధీకి ఈ విషయాలు చెప్పారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా ఈడీ అధికారులు వేధించారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘శివసేన, ఎన్సీపీలు ఊరికే చీలిపోయి అధికార కూటమిలో చేరాయని భావిస్తున్నారా?’’ అని ఈసందర్భంగా సభకు హాజరైన ప్రజలను కాంగ్రెస్ అగ్రనేత ప్రశ్నించారు.

‘బీజేపీది వైట్ కాలర్ అవినీతి’

ఎలక్టోరల్ బాండ్ల లెక్కలతో బీజేపీ అవినీతిమయ నిజస్వరూపం బయటపడిందని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. వైట్ కాలర్ అవినీతికి పాల్పడిన బీజేపీని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ నాశనం చేసిన భారతదేశపు ఆత్మను పరిరక్షించే ప్రయత్నమే ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ అని ఆయన చెప్పారు. ఇండియా కూటమి దేశంలో లౌకిక, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శరద్‌ పవార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉద్ధవ్‌ థాక్రే, మహబూబా ముఫ్తీ, హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన, అఖిలేశ్‌ యాదవ్‌, ఫరూక్ అబ్దుల్లా కూడా ప్రసంగించారు.

Tags:    

Similar News