రేపు 60 బొగ్గు గనుల వేలం.. లిస్టులో శ్రావణపల్లి కోల్‌మైన్

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 60 బొగ్గు గనుల వేలానికి రంగం సిద్ధమైంది.

Update: 2024-06-19 18:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 60 బొగ్గు గనుల వేలానికి రంగం సిద్ధమైంది. వీటికి సంబంధించిన వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం రోజు హైదరాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి రంగానికి చేయూతగా ఉండేందుకు బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్రం వేలానికి పెట్టిన బొగ్గు గనుల్లో తెలంగాణలోని సింగరేణి సమీపంలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ దాదాపు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని భూగర్భ సర్వేలో తేలింది. దీంతో ఈ గనిని దక్కించుకునేందుకు సింగరేణి ప్రయతిస్తోంది. అందుకోసం తొలిసారిగా గనుల వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. గంతలో వేలానికి దూరంగా ఉండడంతో సత్తుపల్లి-3, కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. వేలంలో గనులు దక్కించుకుంటే, అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4 శాతానికిపైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒడిశాలోని 16 బొగ్గు గనులను, మధ్యప్రదేశ్‌లోని 15, ఛత్తీస్‌గఢ్‌లోని 15, జార్ఖండ్‌లోని 6, బిహార్‌లోని 3, బెంగాల్‌లోని 3, మహారాష్ట్రలోని 1 గనిని వేలం వేయనున్నారు.


Similar News