మేము తలుపులు మూసుకు కూర్చోలేదు.. కెనడాకు జైశంకర్ స్ట్రాంగ్ రిప్లే
కెనడా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఏ సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కెనడా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఏ సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన తాజాగా వాషింగ్టన్‌లో భారత మీడియాతో మాట్లాడుతూ.. కెనడా ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు ఉంటే చూపించాలని, వాటిని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. మేము తలుపులు మూసుకుని కూర్చోలేదని గట్టిగా బదులిచ్చారు. ఈ విషయంలో రెండు దేశాల ప్రభుత్వాలు చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో నేరాలకు పాల్పడిన వారు కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని ఎన్నోసార్లు కోరినా కెనడా సహకరించడం లేదు.
ఉగ్రవాదంపై ఆ దేశం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి విషయాల్లో కెనడా ప్రభుత్వంతో భారత్ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటోంది. కెనడాలో మా దౌత్య కార్యాలయాలను టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయి. అంతే కాదు చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. వీటిని సాధారణ పరిస్థితిగా పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు. వాక్ స్వేచ్ఛ పోరుతో మాకు హిత బోధలు అక్కర్లేదని స్పష్టం చేశారు.