‘తిరుగుబాటుకు ఛాన్సే లేదు.. మా ఎమ్మెల్యేల్లో యూనిటీ ఉంది’
జార్ఖండ్ రాజకీయం దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రతీ గంటకో కీలక మలుపు తీసుకుంటూ ఉత్కంఠతకు దారితీస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాజకీయం దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రతీ గంటకో కీలక మలుపు తీసుకుంటూ ఉత్కంఠతకు దారితీస్తోంది. తాజాగా.. ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతోనే ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడం సులభంగా మారింది. అయితే, అనూహ్యంగా కొందరు తిరుగుబాటు చేస్తారని.. దానిని కూటమి తట్టుకోలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా.. ఈ ఆరోపణలను మంత్రి ఆలంగీర్ ఆలం తోసి పుచ్చారు. తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మరి బలపరీక్షలో ఏం జరుగుతుందో చూడాలి.