కాంగ్రెస్ మరింత త్యాగం చేయాల్సిందే: మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్షాల కోసం మరింత త్యాగం చేయాలని పీడీపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు.

Update: 2023-05-21 08:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్షాల కోసం మరింత త్యాగం చేయాలని పీడీపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం నిమిత్తం వచ్చిన ఆమె ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అనేక ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకపోవడంపై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ మరింత త్యాగం చేయాలని.. లేకుంటే ప్రతిపక్షాలకు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారు. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లతో పాటు మరికొంత మంది అపోజిషన్ నేతలను కాంగ్రెస్ ఆహ్వానించకపోవడంపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై ఆమె స్పందిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పునాది వేసిందని, అందరూ ఆశలు వదులుకున్న సమయంలో కర్ణాటక మొత్తం దేశానికి ఆశాకిరణంగా మారిందన్నారు. గత 5 ఏళ్లుగా కర్ణాటకలో బీజేపీ ద్వేషం, మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మళ్లీ అవకాశం దొరికిందన్నారు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆమె తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాను పోటీ చేయకపోయినా తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల్లో ఇప్పుడు చైనా జోక్యం చేసుకుంటోందని ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా బీజేపీ సాధించింది ఇదేనని విమర్శించారు.

Tags:    

Similar News