Manipur: మణిపూర్‌లో కిడ్నాపైన మైతీ యువకులు సేఫ్.. ఆరు రోజుల తర్వాత రిలీజ్

మణిపూర్‌లోని కాంగ్‌పోంక్పిలో కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఇద్దరు మైతీ యువకులను ఎట్టకేలకు గురువారం విడుదల చేశారు.

Update: 2024-10-03 04:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోని కాంగ్‌పోంక్పిలో కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఇద్దరు మైతీ యువకులను ఎట్టకేలకు గురువారం విడుదల చేశారు. ఈ విషయాన్ని సీఎం బిరేన్ సింగ్ వెల్లడించారు. యువకులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెల 27న ఓయినమ్ థోయిథోయ్, నింగోంబమ్ జాన్సన్, థోక్‌చోమ్ అనే ముగ్గురు యువకులు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిమిత్తం ఇంఫాల్ పశ్చిమ జిల్లాకు వెళ్తుండగా..పొరపాటున కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోకి వెళ్లగా.. మిలిటెంట్లు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరిని మరుసటి రోజే విడుదల చేసి ఇద్దరిని బందీలుగా చేసుకున్నారు. దీంతో మైతీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. యువకులను సురక్షితంగా పంపకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్‌పోక్పి జిల్లాలోని కుకీ సంస్థలతో చర్చలు జరిపారు. ఐదు రోజులపాటు జరిగిన చర్చల అనంతరం బందీలను విడుదల చేసేందుకు అంగీకరించారు. గురువారం తెల్లవారుజామున 5.15 గంటలకు గామ్‌గిఫై వద్ద అస్సాం రైఫిల్స్ అధికారుల సమక్షంలో యువకులిద్దరినీ కాంగ్‌పోక్పి పోలీసు సూపరింటెండెంట్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కాంగ్‌పోక్పిలోని కుకీ గ్రూపు గిరిజన ఐక్యత కమిటీ (సీఓటీయూ) బందీల విడుదలకు సహకరించింది. ఈ సందర్భంగా సీఓటీయూ ప్రతినిధి కైమోన్లెన్ సిల్థౌ మాట్లాడుతూ పిల్లలు, వృద్ధులు, పౌరులను ఎప్పుడూ బాధపెట్టలేదని తెలిపారు. అయితే మైతీ ప్రాబల్యం ఉన్న ఇంఫాల్‌లోని సజివా సెంట్రల్ జైలు నుంచి చురాచంద్‌పూర్ జైలుకు 11 మంది ఖైదీలను తరలించాలన్న కుకీ గ్రూపుల డిమాండ్‌కు అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది.


Similar News