'సుప్రీం కోర్టు పోస్టాఫీసులా కనిపిస్తోందా?'.. పిటిషనర్‌పై ప్రధాన న్యాయమూర్తి ఫైర్

‘అత్యున్నత న్యాయస్థానం పోస్టాఫీసులా కనిపిస్తోందా..?’ అంటూ పిటిషనర్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిలదీసింది.

Update: 2023-07-17 15:00 GMT

న్యూఢిల్లీ: ‘అత్యున్నత న్యాయస్థానం పోస్టాఫీసులా కనిపిస్తోందా..?’ అంటూ పిటిషనర్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిలదీసింది. వందే భారత్ రైలుకు తన సొంత జిల్లాలో స్టాప్ కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలంటూ కేరళకు చెందిన 39 ఏళ్ల న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వందే భారత్ రైలు ఎక్కడ ఆగాలో మేము నిర్ణయించాలని మీరు కోరుకుంటున్నారా..? తర్వాత ఢిల్లీ-ముంబై రాజధాని స్టాప్ షెడ్యూల్ ఖరారు చేయాలా..?’ అంటూ న్యాయమూర్తులు నిలదీశారు.

వందే భారత్ రైలుకు తొలుత మలప్పురం జిల్లాలోని తిరూర్‌లో స్టాప్ కేటాయించారని, తర్వాత రాజకీయ కారణాలతో ఆ స్టాప్‌ను పాలక్కాడ్ జిల్లాలోని షోర్నూర్‌కు మార్చారని పిటిషనర్ ఆరోపించారు. అయితే.. రైలుకు స్టాప్‌లు అందించే అధికారం రైల్వే శాఖదేనని, ఫలానా రైలును ఫలానా స్టేషన్‌లో ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని, ఇది పూర్తిగా రైల్వే విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.


Similar News