ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కు ఓటమి తప్పదా?
ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కు గుబులు రేపుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ తర్వాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి ఓటమి తప్పదని చెప్తున్నాయి. ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్‌కు చెందిన నేషనల్ ర్యాలీ( ఆర్ఎన్)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్‌ఎన్ పార్టీ 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్ఎఫ్ పీ) కూటమికి 29 శాతం ఓట్లు పడుంటాయని వెల్లడించింది. కాగా.. జూన్ 7న మరో విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే తుది ఫలితాలపై అంచనా వచ్చే అవకాశం ఉంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లిన మెక్రాన్
ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఓటర్లు ఎన్నుకోనున్నారు. ఇకపోతే, ఈసారి ఓటింగ్ శాతం 65 శాతానికి పెరిగింది. ఇది 2022 ఎన్నికలలో కేవలం 47.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇకపోతే, ఈసారి పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.