Mallikarjun karge: మణిపూర్ ప్రజలను రక్షించడంలో మోడీ విఫలం.. మల్లికార్జున్ ఖర్గే

మణిపూర్ ప్రజలను రక్షించడంలో ప్రధాని మోడీ దారుణంగా విఫలమయ్యారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.

Update: 2024-09-04 15:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ ప్రజలను రక్షించడంలో ప్రధాని మోడీ దారుణంగా విఫలమయ్యారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.16 నెలలుగా రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని నియంత్రించడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హింసను అరికట్టడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని తెలిపారు. శాంతి భద్రతలను సాధారణ స్థాయికి తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ మోడీ రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. మోడీ అహంకారం వల్లే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శాంతి ప్రక్రియను ప్రారంభించడానికి ఏమాత్రం ప్రయత్నించక పోవడం సరికాదని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన డ్రోన్ దాడులను ప్రస్తావిస్తూ..‘ఇంఫాల్ జిల్లాలో డ్రోన్ దాడుల ద్వారా బాంబు దాడి జరిగింది. బీజేపీ నేతల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర హోం మంత్రి స్పందించడంలేదు. సహాయక శిబిరాల దయనీయమైన పరిస్థితులకు వ్యతిరేకంగా గవర్నర్ గళం విప్పినందుకే ఆమెను తొలగించారు’ అని తెలిపారు. రాష్ట్రంలో 67,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు. అంతర్గత కల్లోలమే కాకుండా, ప్రస్తుతం మణిపూర్ సరిహద్దుల్లో జాతీయ భద్రతకు ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించారు.


Similar News