Maharashtra: రాజ్యమాతగా ఆవు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆవును రాజ్య మాతగా ప్రకటించింది.

Update: 2024-09-30 12:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆవును రాజ్య మాతగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సంప్రదాయంలో ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ ఆమోదించిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. రాజ్యమాత హోదాను దేశీయ ఆవులకు మాత్రమే వర్తింపజేస్తామని పేర్కొంది. దీంతో దేశంలోనే ఒక జంతువుకు రాజ్య మాత హోదా కల్పించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘దేశీయ ఆవులు రైతులకు ఒక వరం. కాబట్టి వాటికి రాజ్య మాత హోదా ఇవ్వాలని నిర్ణయించాం. అంతేగాక దేశవాళీ ఆవుల పెంపకానికి కూడా సహాయం చేయడానికి కృషి చేస్తాం’ అని తెలిపారు. కాగా, డియోరి, లాల్కనారి వంటి వివిధ దేశీయ జాతుల ఆవులు మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రలోని డాంగి, షావదాబ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ ఆవుల సంఖ్య వేగంగా తగ్గిపోవడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో తాజా నిర్ణయంతో రైతులు ఈ ఆవులను పెంచుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


Similar News