Supreme Court : ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి.. ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో : ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-09-30 13:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజును సకాలంలో చెల్లించనందుకు సీటును కోల్పోయిన దళిత విద్యార్థి అతుల్ కుమార్ (18)కు అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ ఈ ఆర్డర్స్ ఇచ్చింది. ‘‘అతుల్ లాంటి ట్యాలెంటెడ్ అబ్బాయి ఐఐటీ విద్యను మిస్ కాకూడదు. ఐఐటీ సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అతుల్ పెద్ద న్యాయ పోరాటమే చేశాడు. ఈక్రమంలో అతడు తొలుత జార్ఖండ్, చెన్నై లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఆశ్రయించాడు. అక్కడి నుంచి హైకోర్టుకు, చివరిగా సుప్రీంకోర్టుకు చేరాడు’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. అతుల్ తన చివరి ప్రయత్నంలో జేఈఈకి అర్హత సాధించాడు. జార్ఖండ్‌లోని ఐఐటీ ధన్‌బాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో అతడికి సీటు వచ్చింది.

జూన్ 24న సాయంత్రం 5 గంటలలోగా అడ్మిషన్ ఫీజు (రూ.17,500) కట్టాలి. అయితే అతుల్ తండ్రి ఆ డబ్బును జూన్ 24న సాయంత్రం 4.45 గంటలకు తన కొడుకుకు ఇచ్చాడు. వెంటనే అతుల్ ఆ డబ్బును ఐఐటీ ధన్‌బాద్ పేరిట చెల్లించినా అది ప్రాసెస్ కాలేదు. ఇలా తనకు అడ్మిషన్ మిస్సయిన విషయంపై అతుల్ న్యాయపోరాటం చేశాడు. తన తండ్రి ఒక దినసరి కూలీ అని.. రోజుకు రూ.450 మాత్రమే సంపాదిస్తాడని పిటిషన్‌లో అతుల్ ప్రస్తావించాడు. గ్రామస్తుల సాయంతో రూ.17,500 రెడీ చేసి తనకు తండ్రి ఇచ్చారని అతుల్ పేర్కొన్నాడు. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అతడికి సీటు ఇవ్వాల్సిందే అని ఆదేశాలిచ్చింది. అతుల్‌కు స్వయంగా సీజేఐ డీవై చంద్రచూడ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


Similar News