Nirmala Sitharaman : ఎన్నికల బాండ్ల కేసు.. ఆర్థికమంత్రి నిర్మల, బీజేపీ నేతలకు ఊరట

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇవ్వాలంటూ పారిశ్రామికవేత్తలను బెదిరించారనే అభియోగాలతో నమోదైన కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌, పలువురు బీజేపీ నేతలకు ఊరట లభించింది.

Update: 2024-09-30 14:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇవ్వాలంటూ పారిశ్రామికవేత్తలను బెదిరించారనే అభియోగాలతో నమోదైన కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌, పలువురు బీజేపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసులోని అభియోగాలకు తగిన ప్రతిపాదిక లేనందున విచారణపై కర్ణాటక హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబరు 22న జరుగుతుందని జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ వెల్లడించింది. ‘‘బెదిరింపులకు పాల్పడటం, బలవంతం చేయడం అనేది భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 286 పరిధిలోకి వస్తుంది. అందుకు సంబంధించిన ప్రాతిపదికలేవీ ఆదర్శ్ ఆర్.అయ్యర్ చేసిన ఫిర్యాదులో కనిపించడం లేదు. బీజేపీ నేతల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నామని బాధిత పారిశ్రామికవేత్తలు ఎవరూ నేరుగా ఫిర్యాదు చేయలేదు’’ అని హైకోర్టు ధర్మాసనం ఈసందర్భంగా తెలిపింది.

ఫిర్యాాదుదారుడు ఆదర్శ్ ఆర్.అయ్యర్ తరఫున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు ఇవ్వకుంటే ఈడీ రైడ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు పారిశ్రామికవేత్తలను కేంద్ర ఆర్థికమంత్రి, బీజేపీ నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. కర్ణాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. ఆదర్శ్ ఆర్.అయ్యర్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ నళిన్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇవ్వడం అనేది స్వచ్ఛంద అంశమని, అందులో బలవంతం అనే దానికి తావు లేదని ఆయన పేర్కొన్నారు. 


Similar News