Rahul gandhi: అదానీని ఆదుకునేందుకే అగ్నివీర్ స్కీమ్.. రాహుల్ గాంధీ విమర్శలు
గౌతమ్ అదానీకి ప్రయోజనాలు చేకూర్చేందుకే మోడీ అగ్నివీర్ పథకాన్ని రూపొందించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ప్రయోజనాలు చేకూర్చేందుకే ప్రధాని మోడీ అగ్నివీర్ పథకాన్ని రూపొందించారని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ ఏం చేసినా దాని ఫలితాలు ధనవంతులకే చెందుతున్నాయని ఆరోపించారు. హర్యానాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. సాధారణ జవాన్ జీవితాంతం పెన్షన్ పొందేందుకు అర్హులని, కానీ అగ్నివీర్ లకి పెన్షన్ రాదని తెలిపారు. అగ్నివీర్ ల పెన్షన్లను లాక్కోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ పథకంపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, ప్రతి పేద మహిళకు నెలకు రూ.2000 అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కులగణన సైతం నిర్వహిస్తామని చెప్పారు.