Kashmir Polls : జమ్మూకశ్మీర్ తుది విడత పోలింగ్ రేపే.. 40 స్థానాల్లో 415 మంది పోటీ

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం జరగబోతోంది.

Update: 2024-09-30 17:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం జరగబోతోంది. పోలింగ్ జరగనున్న 40 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కేవలం 28 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఈ విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 37.3 శాతం (156) మంది స్వతంత్రులే. కశ్మీరీ స్థానిక రాజకీయ పార్టీలపై క్రమంగా పెరుగుతున్న వ్యతిరేక వైఖరికి ఈ పోకడే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

బారాముల్లా అసెంబ్లీ స్థానం పరిధిలో అత్యధికంగా 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టఫ్ ఫైట్ ఉన్న ఇతర ముఖ్య స్థానాల్లో సోపోర్, బందీపొర ఉన్నాయి. అత్యంత సమస్యాత్మకమైన కథువా జిల్లా పరిధిలో ఉన్న కథువా, బానీ, బిలావర్, బసోహ్లీ, జాస్రోతా, హీరానగర్ అసెంబ్లీ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరుగనుంది. కథువా అసెంబ్లీ స్థానం పరిధిలో 131 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 24 జమ్మూ డివిజన్‌లో, 16 కశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి. 39 లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ విడతలో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థుల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్ తదితరులు ఉన్నారు. జమ్మూకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అక్టోబరు 5న విడుదలవుతాయి. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Similar News