Afspa: మణిపూర్‌లో ‘అఫ్సా’ పొడిగింపు.. అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది.

Update: 2024-09-30 15:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) ను మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 19 పోలీసు స్టేషన్‌ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్రంలో అఫ్సాను పొడిగిస్తున్నట్టు తెలిపింది. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రాష్ట్రంలో మిలిటెంట్ గ్రూపుల హింసాత్మక కార్యకలాపాలతో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది. అందుకే యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర డిస్టర్బ్డ్ ఏరియా స్థితిని సమీక్షించడం సరికాదు’ అని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణలో భద్రతా సంస్థలు నిమగ్నమై ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, 1980 నుంచి మణిపూర్‌లో అఫ్సా చట్టం అమల్లో ఉంది. దీని ద్వారా హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో అల్లర్లను నియంత్రించడానికి సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. అయితే 2004లో ఇంఫాల్ మున్సీపాలిటీ నుంచి, 2022లో ఆరు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్లు, 2023 నుంచి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో అఫ్సాను రద్దు చేశారు. 


Similar News