Work Stress: లక్నోలో ఈవై ఉద్యోగిని మృతి తరహా ఘటన.. విధుల్లోనే ఒక్కసారిగా కుప్పకూలి..

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా (Ernst and Young India)లో జరిగిన ఘటన లాంటిదే మరోటి జరిగింది.

Update: 2024-09-25 04:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా (Ernst and Young India)లో జరిగిన ఘటన లాంటిదే మరోటి జరిగింది. లక్నో (Lucknow)లో గోమతినగర్‌లోని స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు. గమనించిన సహచరులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఎస్పీ చీఫ్ ఏమన్నారంటే?

ఇకపోతే, ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇది ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొన్నారు. ఒత్తిడి అన్ని కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా ఆలోచించాలన్నారు. ఇది దేశ మానవ వనరులకు పూడ్చలేని నష్టమని చెప్పుకొచ్చారు. ఇటువంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయన్నారు. దేశ పురోగతికి నిజమైన కొలమానం సేవలు లేదా ఉత్పత్తుల గణాంకాల పెరుగుదల కాదని హితవు పలికారు. ఒక వ్యక్తి మానసికంగా స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాడనేది అసలైన దేశపురోగతి అని హిందీలో ఎక్స్ లో పోస్టు పెట్టారు. అలానే, బీజేపీని విమర్శించారు. దేశ ఆర్థిక విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఇకపోతే, ఈ ఏడాది జులైలో పని ఒత్తిడి కారణంగా పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈవై ఉద్యోగిని కేసుపై కేంద్రం విచారణ జరుపుతున్నట్లు కేంద్రమంత్రి మన్ సుఖ్ మండవీయా తెలిపారు.


Similar News