Kangana Ranaut: సాగు చట్టాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా

బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) రద్దు చేసిన సాగు చట్టాలపై వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Update: 2024-09-25 06:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) రద్దు చేసిన సాగు చట్టాలపై వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా.. కంగనా వ్యాఖ్యలపై బీజేపీ (BJP) దూరం పాటించింది. ఆమె కామెంట్లను ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ప్రకటించారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని.. బీజేపీ తరఫున అలాంటి కామెంట్లు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. సాగు చట్టాలపై కామెంట్లు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదని.. ఆమె మాటలు బీజేపీ తీరుని ప్రతిబింబించవని అన్నారు. దీంతో, కంగనా సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. అదంతా తన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కంగనా ఏమన్నారంటే?

తన నియోజకవర్గం మండిలో కంగనా మీడియాతో మాట్లాడారు. అప్పుడు సాగుచట్టాలపై వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ విషయం వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు.. కానీ రద్దు చేసిన మూడు సాగు చట్టాలను అమల్లోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న ఆ చట్టాలను అమలు చేయాలి. రైతులే దేశాభివృద్ధికి అన్నదాతలు. అందుకే వారి శ్రేయస్సు కోసం ఉపయోగకరమైన ఆ చట్టాల కోసం రైతులే డిమాండ్ చేయాలి’’ అని ఆమె అన్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. దానిపైనే మరోసారి కంగనా వివరణ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ఎంపీలు ఎంత ప్రయత్నించినా నట్ట చట్టాలను మళ్లీ తిరిరి తీసుకురాలేరని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. మరోవైపు, కంగనా వ్యాఖ్యలను బీజేపీ విభేదించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రైతుల నిరసనలపై ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆమెను మందలించింది. పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని స్పష్టం చేసింది.


Similar News