అధికార, విపక్షాల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి..!

సభా కార్యకలాపాలకు తరుచూ అంతరాయం కలుగుతుండటంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Update: 2023-08-02 12:43 GMT

న్యూఢిల్లీ : సభా కార్యకలాపాలకు తరుచూ అంతరాయం కలుగుతుండటంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సభలో అధికార  పక్షం, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. లోక్ సభ ఎంపీలు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తనను మార్చుకునే వరకు తాను సమావేశాలకు హాజరు కాబోనని ఆయన అన్నారని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. బుధవారం కూడా లోక్‌సభకు స్పీకర్ ఓం బిర్లా గైర్హాజరయ్యారు. మంగళవారం రోజు లోక్‌సభలో బిల్లుల ఆమోదం సందర్భంగా విపక్షాలు, ట్రెజరీ బెంచ్‌లలో కూర్చునే పలువురు ఎంపీల ప్రవర్తనతో ఆయన కలత చెందారని అంటున్నారు. సభ్యులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని స్పీకర్ ఆశిస్తున్నారని సన్నిహితులు తెలిపారు.

స్పీకర్ గైర్హాజరీ నేపథ్యంలో బుధవారం లోక్ సభ మొదటి సెషన్‌కు  వైఎస్సార్ సీపీ ఎంపీ మిధున్‌ రెడ్డి అధ్యక్షత వహించగా.. రెండో సెషన్‌కు బీజేపీ ఎంపీ కిరీట్ ప్రేమ్‌జీ భాయ్ సోలంకి అధ్యక్షత వహించారు. మళ్ళీ మణిపూర్ అంశంపై, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సభలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. ఈ గందరగోళంగా మధ్యే మధ్యాహ్నం 2 గంటల వరకు సభ కొనసాగి, గురువారానికి వాయిదా పడింది.  ఢిల్లీ ఆర్డినెన్స్ (సవరణ) బిల్లు- 2023ను బుధవారం లోక్ సభలో పరిశీలన, ఆమోదం కోసం షెడ్యూల్ చేశారు. అయితే వాయిదా కారణంగా దానిపై చర్చకానీ ఓటింగ్ కానీ జరగలేదు. దీంతో బీజేపీ విప్‌ కూడా మ్యూట్ అయింది.


Similar News