ప్రారంభమైన లోక్ సభ సెషన్..ఇండియా కూటమి ఎంపీల నిరసన

18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతం ఆలాపన అనంతరం కార్యక్రమాలు స్టార్ట్ కాగా.. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం మొదలు పెట్టారు.

Update: 2024-06-24 07:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతం ఆలాపన అనంతరం కార్యక్రమాలు స్టార్ట్ కాగా.. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం మొదలు పెట్టారు. మొదట ప్రధాని మోడీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన మంత్రి వర్గంలోని ఎంపీలు ప్రమాణం చేశారు. నేడు, రేపు కేవలం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం మాత్రమే ఉండనుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌తో ప్రమాణం చేయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

‘ఇండియా’ కూటమి సభ్యుల నిరసన

లోక్ సభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీనేత మహతాబ్‌ను​ నియమించడం పట్ల ఇండియా కూటమి నేతలు నిరసన తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట రాజ్యాంగ ప్రతులను చేతపట్టి ఆందోళన చేపట్టారు. బీజేపీ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తోందని పలువురు ఎంపీలు ఆరోపించారు. ఎక్కువసార్లు లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ సురేష్‌ను పక్కన పెట్టి భర్తృహరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లో ఉన్న ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సురేష్ కోడికున్నిల్, తలిక్కోట్టై రాజుతేవర్ బాలు, సుదీప్ బందోపాధ్యాయలు పార్లమెంటుకు హాజరుకాలేదు.

ధర్మేంద్ర ప్రధాన్‌కు చుక్కెదురు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కు సభలో చుక్కెదురైంది. ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్షాలు నీట్-నీట్ అంటూ నినాదాలు చేశారు. దేశంలో పేపర్ లీక్‌లు సిగ్గుచేటని..ధర్మేంద్ర వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీకేజీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.  


Similar News